డొనాల్డ్ ట్రంప్.. అమెరికాకి ఒక అధ్యక్షుడిగా కంటే.. వివాదాలకు నిలయంగా బాగా గుర్తింపు తెచ్చుకున్న అగ్రరాజ్యానికి మాజీ ప్రెసిడెంట్. అమెరికా అధ్యక్షుడు అంటే.. ఆ ఒక్కదేశానికే కాదు. ప్రపంచాన్ని దిశానిర్థేశం చేసేలా ఉండాలి. కానీ.. వివాదాలను ఎలా రాజేయాలని అనే విషయంలో మాత్రం ఆయన ప్రపంచానికి నేర్పించాడు. అబద్ధాలు చెప్పడంలో మార్గదర్శిగా నిలిచాడు.
గత ఎన్నికల్లో గెలవడానికి ఎలాంటి కుయుక్తులు పన్నాడో అందరికీ తెలిసిందే. ఎలా అయినా అధ్యక్ష పీఠం మీద కూర్చోవడానికి ఆయన చేసిన మరో ప్రయత్నం తాజాగా బయటపడింది. గడిచిన ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత ట్రంప్ ఓటమి ఖరారైన తర్వాత ఆయన మద్దతుదారులు జనవరి 6న కేపిటల్ హిల్ భవనంపై దాడి చేసిన విషయం వివాదాస్పదం అయింది.
దీనిపై విచారణ జరుపుతున్న హౌస్ కమిటీకి ఈ లేఖ దొరికింది. పోలింగ్ మిషన్లను స్వాధీనం చేసుకోవాలని రక్షణ శాఖ సెక్రటరీకి ట్రంప్ పేరుతో రాసిన లేఖగా దాన్ని గుర్తించారు. లేఖ ముసాయిదాను సిద్ధం చేసుకున్నప్పటికీ.. దాన్ని అధికారికంగా జారీ చేయడానికి అవకాశం లేకపోయింది. ట్రంప్ పేరుతో ఉన్న ఆ లేఖ రక్షణశాఖకు చేరి ఉంటే ఎన్నికల ఫలితాల నిర్ధారణ మరో 2 నెలలు ఆలస్యమయ్యేదని నిపుణులు చెబుతున్నారు.
ఈ రెండు నెలల్లో ఏదో ఒక రకంగా ట్రంప్ అధికారాన్ని చేజిక్కించుకునే వ్యూహాన్ని రచించి ఉంటాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలో కొనసాగడానికి ఆయన విశ్వప్రయత్నాలు చేశారని.. కనీసం అధికార మార్పిడి సజావుగా, ప్రశాంతంగా జరగకుండా అయినా చేయాలనేది ఆ లేఖ వెనుక ఉన్న ఉద్దేశం అని అంటున్నారు.