ప్రమాదకరమైన మూడో ప్రపంచ యుధ్ధాన్ని ఆపగలిగేది తానేనని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 2024 లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఈ పదవికి అభ్యర్థిగా పోటీ చేయగల తనకే ఈ సత్తా ఉందని ఆయన చెప్పారు. లోవాలో ఈ నెల 13 న జరిగిన క్యాంపెయిన్ లో మాట్లాడిన ఆయన.. మూడో ప్రపంచ యుద్ధం తప్పకుండా వస్తుందని భావిస్తున్నానని, ప్రపంచానికి ముప్పు తప్పక పోవచ్చునని అన్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్.. రష్యాను చైనా చేతుల్లో పెడుతున్నారని, ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల అణుయుద్ధం వచ్చినా రావచ్చునని పేర్కొన్నారు. అది చివరకు ప్రపంచ అంతానికి దారి తీస్తుందన్నారు. అమెరికాను రక్షించగలిగేది కూడా తానేనన్నారు.
ఈ దేశాధ్యక్ష పదవికి 2024 లో జరిగే ఎన్నికల్లో నేను విజయం సాధిస్తే 24 గంటల్లోగా రష్యా-ఉక్రెయిన్ వార్ అంతమయ్యేలా చూస్తానని కూడా ట్రంప్ హామీ ఇచ్చారు. 24 గంటలు కూడా మించకపోవచ్చునని వ్యాఖ్యానించారు.
‘రష్యా అధ్యక్షుడు పుతిన్ తో నాకు మంచి సంబంధాలున్నాయి.. నా సూచనలను పుతిన్ పాటిస్తారని భావిస్తున్నా’ అని ఆయన చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం రెండో సంవత్సరం కూడా కొనసాగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. లోవాలో ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల స్థానికులంతా హర్షం వ్యక్తం చేశారు. మా మద్దతు మీకేనని నినాదాలు చేశారు.