అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అరెస్టు చేసిన పక్షంలో ఆయన 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం తథ్యమని ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. ట్రంప్ ని వచ్చే వారం ఫెడరల్ ఏజెన్సీలు అరెస్టు చేస్తాయని ఫాక్స్ న్యూస్ పేర్కొంది. దీనిపై స్పందించిన మస్క్.. ఇదే జరిగితే ట్రంప్ మళ్ళీ భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పారు. మనీ స్కీంకి సంబంధించి తనపై ఏడాదికాలంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని, దీని ఫలితంగా వచ్చే మంగళవారం తాను అరెస్టు కావచ్చునని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు.
ఇందుకు నిరసనలు తెలపాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. దీంతో ‘మన నేత అరెస్టును అందరం ఖండిద్దాం, మన దేశాన్ని రక్షించుకుందాం’ అంటూ ట్రంప్ కి సంబంధించిన ట్రూత్ సోషల్ లో అనేకమంది ట్రంప్ మద్దతుదారులు పిలుపునిచ్చారు. లోగడ పోర్న్ స్టార్ స్టామీ డేనియల్స్ తో తాను జరిపిన రాసలీలలపై ఆమె నోరెత్తకుండా ఉండడానికి ట్రంప్.. ఆమెకు పెద్ద ఎత్తున సొమ్ములు ముట్టజెప్పారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ వ్యవహారం కోర్టులకు కూడా ఎక్కింది.
అయితే ట్రంప్ తాజాగా చేసిన పోస్ట్ పై ప్రాసిక్యూటర్ల నుంచి తమకేమీ నోటిఫికేషన్ అందలేదని ఆయన టీమ్ వెల్లడించింది. దీనిపై వ్యాఖ్యానించడానికి మన్ హటన్ అటార్నీ కార్యాలయం నిరాకరించింది. ఇక ఆయనను అరెస్టు చేయడానికి ముందు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేబట్టాలన్న దానిపై గతవారమంతా సిటీ, స్టేట్, ఫెడరల్ ఏజెన్సీల మధ్య సమావేశాలు, చర్చలు జరిగాయి.
ఒకవేళ నేను అరెస్టయిన పక్షంలో అది 2024 అధ్యక్ష ఎన్నికల్లో నా విజయానికే తోడ్పడవచ్చు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఎలాన్ మస్క్ .. ఈ జోస్యం చెప్పారు. ట్రంప్ మద్దతుదారుల్లో చాలామంది ఇప్పటికే కాలిఫోర్నియా చేరుకున్నారు.