-30దాకా విద్యాసంస్థలకు సెలవు
-వణికిస్తున్న థర్డ్ వేవ్
-అప్రమత్తమైన తెలంగాణ సర్కార్!
-కరోనాపై కేబినెట్ కీలక భేటీ
-ఫస్ట్,సెకండ్ వేవ్ తప్పిదాలపై సమీక్ష!
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం..థర్డ్ వేవ్ ఎంటరై పోయిందనే నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించింది.మరోవైపు కరోనా పరిస్థితులపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ సోమవారం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.రాష్ట్రంలో కరోనా తీవ్రత,నియంత్రణ చర్యలపై కేబినెట్ మీటింగ్ జరగనుంది.
మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్నకేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే కరోనా మొదటి, రెండవ వేవ్ లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలు ఉన్నాయి.ఇప్పుడు మరోసారి మహమ్మారి విజృంభణ పెరుగుతున్ననేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. గతసారి కరోనా కట్టడికి ప్రభుత్వం అనుసరించిన విధానంపై ఇంటా బయట విమర్శలు ఎదుర్కోంది.కరోనా పరీక్షల సంఖ్య ఎందుకు నామమాత్రంగా ఉందని గతంలో స్వయంగా హైకోర్టు ప్రశ్నించింది.
కేవలం రాత్రి కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారని అప్పట్లో ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వంపై మండిపడింది.కరోనా పరీక్షలు తగ్గించి కేసులు తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ విషయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని, ప్రజారోగ్యం విషయంలో రాజీపడకూడదని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే..సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో వందల కరోనా మరణాలు చోటుచేసుకోవటం.. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క మరణాలు..అటు..కొంత మందికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో బెడ్లు దొరికినా.. లక్షల్లో చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి విషయాల్లో కూడా ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించిందనే ఆరోపణలు ఎదుర్కొంది.దీంతో..కేబినేట్ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని ఆసక్తి నెలకొంది. సొంతూళ్లకు వెళ్లిన వారు సంక్రాంతి తరువాత నగరానికి వస్తారు. కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంది.మళ్లీ కేసులు పెరిగితే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుగనుందని తెలుస్తోంది. అటు, విద్యాసంస్థలకు సెలవులు ఈ నెల 30 వరకు పొడిగించారు.ఆ తరువాత ఆన్లైన్ క్లాసులు పెట్టాలా?ప్రత్యక్షంగా స్కూల్స్,కాలేజీలు తెరవాలా అనే దానిపై చర్చించనున్నట్టు సమాచారం.కొంత కాలం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తే మంచిదని వైద్య ఆరోగ్యశాక ప్రభుత్వానికి సూచించింది.దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.మేలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరిగి విద్యార్థులు క్లాసులకు దూరం అయితే పరీక్షలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ అన్నిఅంశాలపై కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.