గ్రేటర్ ఎన్నికలకు ఈసీ సిద్ధమవుతున్న వేళ.. అధికార పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. సాయంత్రం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ జరగనుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి, వరంగల్-ఖమ్మం- నల్గొండ నియోజకవర్గాల్లో రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా త్వరలోనే నిర్వహించనున్నందున పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
వరదల కారణంగా హైదరాబాద్‌లో జరిగిన నష్టంతో పాటు, జిల్లాల్లో పంట నష్టాలు, సన్నరకం వడ్డకు మద్దతు ధర విషయంపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే కొత్త సాదా బైనామా అప్లికేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో తదుపరి చర్యలపైనా మంత్రిమండలి చర్చించనుంది.
గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో చేసినట్టుగానే మంచినీటి ఛార్జీల బకాయిలను మాఫీ, అలాగే పేద, మధ్య తరగతి వర్గాలకు ఆస్తి పన్నులో తగ్గింపు వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఈ నిర్ణయాల కారణంగానే గత ఎన్నికల్లో గెలిచామని అధికార పార్టీ భావిస్తోంది.