తెలంగాణలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయి మూడు నెలలవుతుంది. కోర్టు స్టే ఉందని ముందుగా ప్రచారం చేసినా… మేం పాత పద్ధతిని వద్దు అని చెప్పలేదంటూ కోర్టు స్పష్టం చేయటంతో సర్కార్ రిజిస్ట్రేషన్స్ చేస్తానని ప్రకటించింది. సోమవారం నుండి స్లాట్స్ పద్ధతితో రిజిస్ట్రేషన్స్ మొదలుకానున్నాయి.
కానీ పాత పద్ధతి అంటే అందులో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. దీంతో సర్కార్ కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి కేటీఆర్, తలసాని, ఎర్రబెల్లి, మహమూద్ అలీ సభ్యులుగా ఈ కమిటీ ఏర్పాటైంది. నాలుగు రోజుల పాటు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ గ్రూపులతో చర్చలు జరిపి… పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు సాగేందుకు రోడ్ మ్యాప్ రెడీ చేయాలని ఆదేశించారు.
ఓవైపు రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టామని ప్రకటించి, మరోవైపు సబ్ కమిటీ వేయటం వెనుక సర్కార్ లో ఉన్న గందరగోళ వాతావరణానికి నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సీఎం కేసీఆర్ పట్టింపులతోనే మూడు నెలల పాటు రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా మూలకు పడిందని, ఇప్పుడు సంప్రదింపులు జరిపి… కొత్త ప్రక్రియ మొదలుపెట్టి, సజావుగా సాగాలంటే ఇంకాస్త సమయం పడుతుందని… కరోనా లాక్ డౌన్ ప్రభావం నుండి కోలుకుంటున్న రియల్ రంగంపై ఇది భారీ ప్రభావం చూపుతుందని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సబ్-కమిటీలు కేవలం కాలయాపన కోసమేనని… సీఎం కేసీఆర్ ఆలోచనలను కాదని సబ్-కమిటీ సూచనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుందా అన్న సందేహాం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.