బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సాయన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వివిధ పదువుల ద్వారా సాయన్న చేసిన ప్రజాసేవ చిరస్మరణీయమని కొనియాడారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాయన్న ఆరుదైన ఘనత సాధించారని అన్నారు కేసీఆర్.
సాయన్న మృతికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. సాయన్న కంటోన్మెంట్ ప్రజల శ్రేయస్సు కోసం శ్రమించారని, ఆయన మృతి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.
ఎమ్మెల్యే సాయన్న మృతికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ రవిచంద్ర, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సంతాపం తెలిపారు. ఆయన మృతి బీఆర్ఎస్ కి తీరని లోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని అన్నారు.
కాగా కంటోన్మెంట్ నుంచి సాయన్న ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నుంచి నాలుగు సార్లు గెలవగా.. 2018లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సాయన్న రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.