ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో ఆర్టీసీ సిబ్బంది 1200 మాత్రమే. మిగిలిన వారిని డిస్మిస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేనే లేదు. ఎవరు ఎవర్నీ డిస్మిస్ చేయలేదు. వాళ్లంతట వాళ్లే తొలగిపోయారు. గడువులోపల విధుల్లో చేరకపోవడంతో వాళ్లది ‘సెల్ఫ్ డిస్మిస్’ అయినట్లేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. ప్రభుత్వ, ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తికి వారు స్పందించలేదు తొలగిపోయిన వారు డిపోల దగ్గర కానీ, బస్‌స్టేషన్ల దగ్గర కానీ గొడవచేస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయమని డీజీపీని ఆదేశించినట్టు చెప్పారు. విధుల్లో ఉన్న 1200 మంది తప్ప ఎవరు వచ్చి దురుసుగా ప్రవర్తించినా సరైన చర్యలు తీసుకుంటారని అన్నారు.
హైదరాబాద్: రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆర్టీసీకి సంబంధించి ఇచ్చిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులతో పాటు మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదని, ఆర్టీసీ సంస్థ ఉండి తీరాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో అసౌకర్యం కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. తదనుగుణంగా ఆర్టీసీని పటిష్టం చేయడానికి అనేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. మొత్తం ఆర్టీసీని ప్రయివేట్‌పరం చేయడం వివేకమైన చర్యకాదని కూడా ఆయన అన్నారు. క్రమశిక్షణను తు.చ. తప్పకుండా అమలు చేసి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ చెప్పారు.