తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో మెగా ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రాజెక్ట్ ఉద్దేశించబడింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా- కొత్తగా ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోను నిర్మించ తలపెట్టారు సీఎం కేసీఆర్. అతి తక్కువ సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకునేలా మెట్రో ప్రాజెక్ట్ ను రూపొందించనున్నారు.
Hyderabad Forges ahead on A Faster Track !
CM Sri KCR will lay the foundation stone for Airport Express Metro on 9th December, 2022.#HyderabadExpressMetro pic.twitter.com/mqYCB0Ggaa
— TRS Party (@trspartyonline) December 8, 2022
ఐటీ హబ్‌గా గుర్తింపు ఉన్న గచ్చిబౌలి-మాదాపూర్-కొండాపూర్-మైండ్ స్పేస్ టెక్నాలజీ పార్కులకు రాకపోకలు సాగించడానికి వీలుగా దీన్ని అందుబాటులోకి తీసుకుని రానున్నారు. ఆయా ప్రాంతాల నుంచి మెట్రో రైలు ద్వారా అతి తక్కువ సమయంలో నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకోవచ్చు. ప్రపంచ స్థాయి పెట్టుబడులతో భారీగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎయిర్ పోర్టుకు మెట్రో అనుసంధానం చేస్తే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు సీఎం కేసీఆర్ డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే మూడేళ్లలో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని కేసీఆర్ చెప్పారు. ఇది మెట్రో బయోడైవర్సిటీ జంక్షన్, కాజాగూడ రోడ్డు మీదుగా ఔటర్ రింగ్ రెడ్డు వద్ద నానక్ రామ్ గూడ జంక్షన్ ను తాకుతుంది.
హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణ అంచనా విలువ 6,250 కోట్ల రూపాయలు. ఈ మార్గంలో అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలను నిర్మిస్తున్నాయి. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు దీన్ని నిర్మించ తలపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. మైండ్ స్పేస్ జంక్షన్-శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మధ్య 31 కిలోమీటర్ల మేర నిర్మాణాన్ని పూర్తి చేసుకోనుంది.