తెలంగాణ ఎంసెట్ ఫలితాల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అనుకున్న షెడ్యూల్ కన్నా గంటన్నర ముందే ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 9.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.
జవహర్‌లాల్ నెహ్రూ అగ్రికల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వాకాటి కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
మే 10,11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. మే 12 నుంచి 15 వరకు ఆరు బ్యాచ్‌లుగా ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 2 లక్షల మంది విద్యార్థులు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు.
ఎంసెట్‌లో అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫలితాల ర్యాంకులు, మార్కులను రేపు విడుదల చేస్తారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ తో ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాలను విద్యార్థులు eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.