తెలంగాణ ఎంసెట్ 2023 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ను ఉన్నత విద్యామండలి నిర్వహిస్తుంది. మండలి తరఫున టీఎస్ ఎంసెట్ కన్వీనర్ పరీక్షల నిర్వహణ అధికారిగా ఉంటారు. టీఎస్ ఎంసెట్ కోసం కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తులను మార్చి 3 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆలస్య రుసుం లేకుండా స్వీకరిస్తారు. ఇంజినీరింగ్ ప్రవేశం కోసం పరీక్షను మే 7 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, మే 8న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. అలాగే మే 9వ తేదీన కూడా ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు పరీక్ష నిర్వహిస్తారు.
అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం మే 10, మే 11 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్ష నిర్వహిస్తారు.ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన అభ్యర్థులు ఇంజినీరింగ్ లేదా మెడికల్ ప్రవేశం కోసం రూ. 500 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇతరులు రూ. 900 చెల్లించాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్, అలాగే అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే రూ. 1000 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులైతే రూ. 1800 చెల్లించాల్సి ఉంటుంది. టీఎస్ ఎంసెట్ సమగ్ర నోటిఫికేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్, ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్ తదితర వివరాల కోసం ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు.