వారం రోజుల క్రితం భారీ వర్షాలు తెలంగాణలోని జిల్లాలను అతలాకుతలం చేశాయి. వరదలు ముంచెత్తి గ్రామాల్లో రాకపోకలు ఆగిపోయాయి. ఇంకొన్ని రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో ఆ సమయంలో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిలో ఈసెట్, పీజీఈసెట్, ఎంసెట్ ఉన్నాయి. తాజాగా వాటి కొత్త షెడ్యూల్ విడుదల చేసింది ఉన్నత విద్యామండలి.
ఈ నెల 30, 31న ఎంసెట్ అగ్రికల్చర్, ఆగస్టు 1న ఈసెట్, ఆగస్టు 2 నుంచి 5 వరకు పీజీఈసెట్ ను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి వివరాలు వెల్లడించారు.
వర్షాల కారణంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం మొదట మూడు రోజులు సెలవులు ప్రకటించిందని గుర్తు చేశారు. దానివల్ల జులై 13న నిర్వహించాల్సిన ఈసెట్ ను వాయిదా వేశామన్నారు. అలాగే జులై 14, 15న కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేసినట్లు గుర్తు చేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు లింబాద్రి.
మరోవైపు ఈనెల 18 నుంచి 20 వరకు జరగాల్సిన ఇంజనీరింగ్ ఎంసెట్ ను అనుకున్న షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తున్నారు లింబాద్రి. అభ్యర్థులు సంబంధిత వెబ్ సైట్ల నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.