పాతబస్తీ వాసులకు మంత్రి హరీష్ రావు శుభవార్త చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం రూ.2,90,396 కోట్లతో ఆయన శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. భాగ్య నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఎంజీబీఎస్ – ఫలక్ నుమా మధ్య మెట్రో రైల్ నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించింది.
హైదరాబాద్ మెట్రోకు రూ.1500 కోట్లు కేటాయించిన సర్కార్.. పాతబస్తీ మెట్రోకు రూ.500 కోట్లు, శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రోకు మరో రూ.500 కోట్లు ప్రతిపాదించింది.
మెట్రో మూడు కారిడార్లలో ఒకటైన పరేడ్ గ్రౌండ్ – ఫలక్‌నుమా కారిడార్ ను మొత్తం 14 కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్లాన్ చేశారు. అయితే అలైన్ మెంట్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు ప్రతిపాదించిన 5.5 కిలో మీటర్ల మార్గం నిర్మాణం ఆగిపోయింది.
దీంతో జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ఎంజీబీఎస్ వరకు పూర్తి అయిన 9.6 కిటోమీటర్ల మార్గాన్ని 2020లో అందుబాటులోకి తెచ్చారు. తాజాగా అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ప్రభుత్వం ఫలక్ నుమా వరకు మెట్రోను పొడిగించేందుకు సిద్ధమైంది. త్వరలోనే భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించనుంది.