ఏటా పదివేల కోట్లకు పైగా ఆదాయం రాబట్టే డిపార్ట్ మెంట్
ఏళ్ల తరబడిగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్న వైనం
ఐదేళ్ల క్రితం సర్కార్ సొంత భవనాలు కట్టిస్తామని మాట ఇచ్చిన కేసీఆర్
మాటలు కోటలు దాటినా.. పనులు గడపలు దాటని పరిస్థితి
రాష్ట్ర సర్కార్ కు భారీ ఆదాయం సమకూర్చే శాఖల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఒక్కటి.వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ తర్వాత మూడో స్థానంలో రిజిస్ట్రేషన్ శాఖ వుంటుంది. ప్రతి ఏటా 10 వేల కోట్లకు పైగా ఆదాయం సేకరిస్తుంది. అయినా.. రిజిస్ట్రేషన్ శాఖపై సర్కార్ చిన్న చూపే చూస్తోంది. ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. కనీస వసతులు లేక అధికారులు, సిబ్బంది, పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్ రిజిస్టర్ కార్యాలయాలున్నాయి. నిత్యం వేలాది మంది క్రయ విక్రయదారులు.. ఆస్తుల రిజిస్ట్రేషన్, మ్యారేజ్ సర్టిఫికేట్, ఇతర డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం వస్తుంటారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. నిత్యం రద్దీగా కనిపిస్తాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణలో 8 మాత్రమే సొంత భవనాలున్నాయి. రాష్ట్రం వచ్చాక రిజిస్ట్రేషన్ శాఖకు సొంత భవనాలు లేక పోవడం బాధాకరమంటూ.. దుస్థితి ప్రతి సబ్ రిజిస్టర్ కార్యాలయాలు సొంత భవనాల్లో వుండేలా చూస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే 2016లో 108 భవనాల నిర్మాణాలకు సర్కార్ అనుమతులు ఇచ్చింది. వాటి నిర్మాణాల కోసం దశల వారిగా 65 కోట్లు రిలీజ్ చేసింది. కానీ పనులు మాత్రం మొదలు పెట్టలేదు.
సర్కార్ 108 సొంత భవనాలకు అనుమతులు ఇస్తే.. ఇప్పటి వరకు.. 27 మాత్రమే పూర్తయ్యాయి. మరో 6 బిల్డింగ్ లు.. దాతల నుండి విరాళంగా వచ్చాయి. ఇక చాలా చోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కేటాయించిన భూములపై కోర్టు కేసులు పడడంతో అవి ముందుకు సాగడం లేదు. కొన్ని చోట్ల పనులు మొదలు పెట్టినా.. నిధులు లేక మధ్యలోనే ఆగిపోయాయి. మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాల్లోనే కొత్త భవనాలు నుంచి పనులు జరుగుతున్నాయి. 108 భవనాలు పూర్తి కావాలంటే మరో 100కోట్ల వరకు అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారులు సర్కార్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. కానీ ప్రభుత్వం మాత్రం 100కోట్లు ఇవ్వడానికి వెనుకాడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని అద్దే భవనాలే వున్నాయి. సిటీ లో చాలా మంది బిల్డర్లు, ఇంటి ఓనర్లు.. ఆయా ఇంటిని గిఫ్ట్ చేయడానికి ముందుకొస్తున్నా.. సర్కార్ మాత్రం వద్దంటుంది. ప్రతి నెల 15 నుండి 20 లక్షల వరకు అద్దె చెల్లిస్తుంది. రిజిస్ట్రేషన్ శాఖ.. కరెంట్ బిల్లులు, ఇతర ఖర్చులు కలుపు కొని ఏటా రెండున్నర కోట్ల వరకు చెల్లిస్తుంది. ఇలా సర్కార్ ప్రతి ఏటా రిజిస్ట్రేషన్ శాఖ నుండి వేల కోట్లు తీసుకుంటున్నా.. వంద కోట్లు ఇవ్వడానికి ఆలోచిస్తుంది. సర్కార్ నిధులు ఇవ్వకుండా.. రాష్ట్రంలో కడుతున్న కొత్త సచివాలయం, కొత్త కలెక్టరేట్ భవనాలు పూర్తైతే.. పాత కలెక్టరేట్ భవనాల్లోకి, mro ఆఫీసులోకి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
2020-21లో 10,000 కోట్లు టార్గెట్.. 2021-22లో 12,500 కోట్లు టార్గెట్ పెట్టిన సర్కార్. ఆదాయం రాబట్టడం తప్ప.. వసతులు కల్పించడానికి మాత్రం ఇష్టపడటం లేదు. భూముల రేట్లు, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచి అడ్డగోలుగా దండుకుంటున్న సర్కార్.. రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం ఇచ్చే శాఖకు నిధుల కొరత పేరు చెబుతూ తప్పించుకుంటుంది. 100 కోట్లు ఇవ్వడనికి ఆలోచిస్తున్న కేసీఆర్ సర్కార్.. ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో కాలం వెళ్లదీస్తుంది. ఇంటి ఓనర్లు కోర్టు నోటీసులు ఇచ్చినా.. ఖాళీ చేయకుండా పబ్బం గడుపుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్ లో సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో.. కనీస వసతులు కూడా లేని పరిస్థితి నెలకొంది. నిధుల కోసం.. సర్కార్ కు లేఖ రాసినా.. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని అధికారులు వాపోతున్నారు.
రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా ఉన్న వ్యక్తి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కావడంతో.. గట్టిగా అడగలేని పరిస్థితి నెలకొందని కొందరు చెబుతున్నారు.సొమ్ము మాది, సోకులు మరో శాఖకు అప్పగిస్తూ.. తమని పట్టించుకోవడం లేదని.. ఉద్యోగులు మండిపడుతున్నారు. నిధుల కొరతతో ఆఫీస్ ఫోన్ నంబర్స్ కు బిల్లు చెల్లించలేని దుస్థితి రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులకు ఏర్పడింది. దీంతో, సొంత నంబర్ లే ఆఫీస్ పనులకు కూడా వాడుతున్నారు.