– వివాదాస్పద కేంద్ర ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే కుట్ర
– ఎకరం రూ. 40 కోట్ల పలికే భూములకు ఎసరు
– ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు
– సర్వే నెంబర్లు 301, 303, 325 -328, 331లలో అసలు జరిగిందేంటి?
– పుప్పాలగూడలో రూ. వేల కోట్లు విలువ చేసే 958 ఎకరాలపై కన్ను
– కాందీశీకుల భూముల్లో అసలేం జరిగింది- తొలివెలుగు ఎక్స్‌క్లూజివ్ స్టోరీ
కంచే చేను మేస్తోంది. కేంద్ర ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే వాటిపై కన్నేస్తోంది. తెలివిగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతోంది. పుప్పాలగూడలో 70 ఏళ్లుగా పొజిషన్‌లో ఉన్న రైతుల కంట్లో కారం కొడుతోంది. హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తోంది. పుప్పాలగూడలో మళ్లీ కూల్చివేతలకు దిగింది. కార్పొరేట్ సంస్థల లాబీయింగే ఇందుకు ముఖ్య కారణంగా తెలుస్తోంది.
పుప్పాలగూడ భూముల చరిత్ర ఇది!
ప్రస్తుతం కూల్చివేతలు జరుగుతున్న ఏడు సర్వే నెంబర్లలో 108 ఎకరాల భూమి ఉంది. 301లో 11 ఎకరాలు, 303లో 17 ఎకరాలు, 325లో 11-23 గుంటలు, 326లో 18-28, 327లో19-23, 328లో 15-28, 331లో 14-14 గుంటల భూమి ఉంది. 15వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన లోధా కుటుంబాలు.. 1930 నుంచి ఈ భూముల్లో కందులు, ఉలువలు సాగుచేసేవారు. 1950 రికార్డుల నుంచి రైతులు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. శిస్తు కూడా కడుతున్నారు. పహాణీల్లో వాళ్ల పేర్లు నమోదయ్యాయి. కాందీశీకుల భూముల్లో ఎక్కువ కాలం ఎవరు కాస్తు చేసుకొని, పంటలు పండించుకున్నారో వారికే ఇవ్వాలని గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. అప్పట్లో వలసలు వెళ్లిన వారు తమ భూములను కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేసి వెళ్లారు. ఆయా భూములను పాకిస్తాన్ లేదా మరో దేశం నుంచి వచ్చిన వారికి అప్పగించే వారు.
దొంగ పత్రాలతో భూమిని కాజేయాలని..
గతంలో ఎంతో మంది దొంగపత్రాలు సృష్టించి.. హైదరాబాద్‌లోని కాందీశీకుల భూములను అమ్మకానికి పెట్టారు. పుప్పాలగూడలోనూ అదే జరిగింది. రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న నేపథ్యంలో కొంత వరకు భూములు రైతుల చేతిలో ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే...
1964 మే, 6న కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి అంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. కాందీశీకుల్లో ఎంత మందికి భూమికి అలాట్మెంట్ చేశారు? ఎంత మంది రిపోర్ట్ చేశారో తెలియజేయాలని అదేశించింది. అప్పటి తహశీల్దార్ అనంత్ సింగ్ సెప్టెంబర్ 9, 1965 న ఓ రిపోర్ట్ పంపించారు. ఆయా సర్వే నెంబర్లు అన్ని అలాట్మెంట్ అయ్యాయని, కానీ ఎవరూ రిపోర్ట్ చేయలేదని నివేదించారు. కానీ రైతులు లాంగ్ టర్మ్ పోజిషన్లో ఉన్నారని తెలిపారు. 1966 జనవరి 27న రైతులకు స్టాండర్డ్ ఎకరానికి రూ. 450 చొప్పున రెగ్యులరైజేషన్ చేయాలని మళ్లీ లేఖ ద్వారా కోరారు. ఒక్క స్టాండర్డ్ ఎకరం అంటే.. ఎకరం 32 గుంటలుగా కొలుస్తారు. ఇందులో వచ్చిన ఆదాయంలో సెంట్రల్ గవర్నమెంట్‌కి 15 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్‌కి 85రూపాయల చొప్పున తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అదేశించింది. కానీ అప్పుడు రైతులు ఎవరూ ఆ డబ్బులు చెల్లించలేదు. తాము రక్షిత కౌలుదారు చట్టం- 1950 ముందు నుంచే చలానాలు చెల్లించామని ధీమాగా ఉన్నారు. చలనా నెంబర్ 1702… తేదీ -04-07-1951. ఇదంతా అసిస్టెంట్ కస్టోడియన్, కస్టోడియన్ ఆఫ్ ప్రాపర్టీకి చెల్లించినట్లు 30-06-1951లో అనాడు విడుదల చేసిన జాబితాలో ఉంది. ఈ రికార్డులు అసిస్టెంట్ కస్టోడియన్ అండ్ పర్సనల్ అసిస్టెంట్ టూ కలెక్టర్ హైదరాబాద్ వారు ఈ జాబితాను రూపొందించారు. సర్వే నెంబర్ 301లోని భూమికి 2 రూపాయల శిస్తు.. 303లో భూమికి 15 రూపాయల 36 పైసలు, ఇలా ఏడు సర్వే నెంబర్స్‌కి 90 రూపాయల 23 పైసలు చెల్లించారని ఆ చలానాలో ఉంది. అయితే 1980 మే 24న ఒక మెమో జారీ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అదే మెమో నెంబర్ 25 (II). ఇందులో ఒక వేళ స్టేట్ అమలు చేయకపోతే సెంట్రల్ అమలు చేయవచ్చని స్పష్టం చేశారు. 1994లో పుప్పాలగూడలోని కొన్ని సర్వే నెంబర్లోని వారు.. సెంట్రల్ నుంచి రెగ్యులరైజెషన్ చేసుకున్నారు. ఇందులో కొన్నింటిని చెప్పుకోవాలంటే 297,298 సర్వే నెంబర్లు.
మాల్‌పాణి కేసు..
దొంగ పత్రాలు సృష్టించి ఈ భూమి తమదేనని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిట్ పిటిషన్ 14066-2006, 14067-2006.. ఈ దొంగ అలాట్‌మెంట్ చెల్లదని హైకోర్టు 2016 ఫిబ్రవరిలో తీర్పునిచ్చింది. అయితే ఈ కేసులో పూర్వాపరాలు తెలియకుండానే.. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమిఅని స్టేట్ గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకుంటోంది. సుప్రీం కోర్టులో మాల్ పాణి 2016లో కేసు వేశారు. 2019 అక్టోబర్ 22న మళ్లీ మాల్ పాణికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయితే రైతులు లాంగ్ టర్మ్ ఉన్నారు కాబట్టి తమకే భూమి చెందుతుందన్నది రైతుల వాదన. డిస్ ప్లేస్డ్ పర్సన్స్ యాక్ట్ 1950లో యాక్ట్ నెంబర్ 38 ప్రకారం, ఆర్టికల్ 14 అలాగే 300 A ప్రకారం, కాంపెన్సెషన్ అండ్ రిహబిటేషన్ యాక్ట్ 1954 అలాగే 1944 సెక్షన్ 31,32,33,34, ప్రకారం రైతులు న్యాయం జరగాలని హైకోర్టులో ఫైట్ చేస్తున్నారు. అయితే మాల్ పాణి కేసులో సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ అయిన రైతులను హైకోర్టులో తెల్చుకోవాలని సూచనలు చేసింది. హైకోర్టు అన్ని కేసులను జత చేసి ఒకేసారి వినేందుకు సిద్ధమైంది. న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న భూములపై తెలంగాణ సర్కార్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తుండటంతో వివాదం నెలకొంటోంది. రైతులు తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్ నచ్చిన వారికి అక్రమంగా HMDA పర్మిషన్ లు ఇచ్చింది. దీని వెనుక ఎవరెవరికి. ఎన్ని వందల కోట్ల లబ్ధి చేకూరిందో.. మరో కథనంలో తొలివెలుగు అందిస్తుంది.