నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో..తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. మాటలగారడీతో ప్రజలను మభ్య పెట్టలేమని దుబ్బాక దెబ్బతో అర్థం చేసుకున్న అధికార పార్టీ.. సాగర్‌లో ఆ పరిస్థితి పునరావృత్తం కాకుండా ముందు జాగ్రత్తలకు దిగింది. నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన పనుల ఫైళ్ల దుమ్మును దులుపుతోంది. ఆగమేఘాల మీద అనుమతులు కూడా ఇచ్చేస్తోంది.
తాజాగా నాగార్జునసాగర్‌కు ఓ డిగ్రీ కళాశాల అలాగే ఒక ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసింది ప్రభుత్వం. హాలియాలో డిగ్రీ కళాశాలను ప్రారంభించేందుకు వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ఇదే నియోజకవర్గంలో నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ఆధారంగా రూ.72.16 కోట్లతో నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మణానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న చాలా పనులకు త్వరలోనే మోక్షం కలగబోతోందని టాక్. ఏదేమైనా దుబ్బాక దెబ్బ.. అధికార పార్టీకి చాలా గుణపాఠమే నేర్పినట్టుందని విశ్లేషకులు అంటున్నారు.