హైదరాబాద్ నడి బొడ్డున కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న అత్యంత విలువైన 540.30 ఎకరాల స్థలం ఉదాసీన్ మఠానికి అందింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో భూమిని అప్పగించింది ప్రభుత్వం. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బాలాజీ, పోలీస్ బందోబస్తు మధ్య ఐడీఎల్ స్థలంలో ప్రవేశించి, జీఓసీఎల్ స్థలం అంటూ సూచించే బోర్డులను చెరిపి వేయించారు. స్థలం ఉదాసీన్ మఠానికి చెందినది అంటూ బోర్డులను ఏర్పాటు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. గత నెలలో ఈ భూములపై పూర్తి హక్కులు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఉదాసిన్ మఠానివేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఐడీఎల్ కెమికల్స్ వర్సెస్ ఉదాసిన్ మఠం అనేలా సాగిన ఈ కేసులో గత నెలలో తుది తీర్పు వెలువరించింది న్యాయస్థానం.
కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ఉదాసిన్ మఠం భూములను 1964, 1966,1969, 1978లో నాలుగు దఫాలుగా బఫర్ జోన్ ఉన్న గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కు 99 సంవత్సరాల కాల వ్యవధికి లీజుకిచ్చారు. అయితే, బఫర్ జోన్ లో ఉన్న ఈ భూముల్లో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ 538 ఎకరాల విస్తీర్ణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించింది. దీన్ని సవాల్ చేస్తూ ఉదాసిన్ మఠం దేవాదాయ శాఖ ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది.
పిటిషన్ విచారించిన ట్రైబ్యునల్ 2011 సంవత్సరంలో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కు ఇచ్చిన లీజును రద్దు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. 2013లో ఆ పిటిషన్ డిస్మిస్ అయింది. దాన్ని కూడా సవాల్ చేస్తూ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. 2013లో స్టేటస్ కో మేయింటెన్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. గత నెలలో ఈ పిటిషన్ విచారణకు రాగా డిస్మిస్ చేస్తూ సుప్రీం తీర్పును వెలువరించింది. సుప్రీం ఆదేశాలతో తాజాగా ఆ భూములను మఠానికి అప్పగించింది ప్రభుత్వం.
ఉదాసీన్ మఠాధిపతి మహాంత్ శ్రీ రఘు మునీజీ మాట్లాడుతూ.. ఈ స్థలంలో తమ గురువులు, తపస్సు చేశారని, పవిత్రమైన తపో భూమిలో అనాథ శరణాలయం, విశ్వవిద్యాలయం, అన్నదాన సత్రం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బాలాజీ పాల్గొన్నారు.