ఓవైపు ఆర్టీసీ కార్మికులతో చర్చలంటూనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మెలో పాల్గొన్నవారిపై ఎస్మా ప్రయోగించేందుకు సిద్ధమయింది. దీనిపై ఆర్టీసీ ఎండీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీలో సమ్మె చట్ట విరుద్దమని, సమ్మెలను నిషేధించినందున కార్మికులు ఎవరూ సమ్మెలో పాల్గొనవద్దని హెచ్చరించారు. కాదని ఎవరైన కార్మికులు సమ్మెకు వెళ్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ. ప్రతి డిపోలో నోటీసులు అంటించాలని అధికారులను ఆదేశించారు.
ఇక, సమ్మెలో పాల్గొనని కార్మికులకు పోలీస్ భద్రత కల్పిస్తామని తెలిపారు ఆర్టీసీ ఎండీ. ప్రతి డిపో దగ్గర పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్ని హెచ్చరికలు చేసినా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో దిగిపోయారు. ఆర్టీసీ ఎండీ ఆదేశాలపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఓ వైపు చర్చలు అంటూనే మరోవైపు ఎస్మా అంటే ఎవరూ భయపడరని తెగేసి చెప్తున్నారు కార్మిక సంఘాల నేతలు. ఇలావుంటే దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఇప్పటికే నిలిపివేసినట్లు తెలుస్తోంది.
అయితే, ఎస్మా ప్రయోగించటం వల్ల సమ్మెలో ఉన్న కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించే అవకాశం యాజమన్యానికి ఉంటుంది. అవసరమైతే సమ్మెలో ఉన్న కార్మికులను కూడా అరెస్ట్ చేయవచ్చంటున్నారు రవాణా శాఖ ఉన్నతాధికారులు.