ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి అలెర్ట్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇంటర్ సిలబస్ పై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న వార్షిక పరీక్షలతో పాటు సప్లిమెంటరీ పరీక్షలను 100 శాతం సిలబస్ తోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
అంతేకాకుండా 100 శాతం సిలబస్ తో కూడిన ఇంటర్ ప్రశ్నా పత్రాలను బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు ఆయన ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో 70 శాతం సిలబస్ తోనే బోధన, పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తగినన్ని రోజులు క్లాసులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విద్యార్థులపై భారం పడకుండా ప్రభుత్వం 70 శాతం సిలబస్ తోనే తెలంగాణ ప్రభుత్వం విద్యా బోధన, పరీక్షలు జరిపించింది.
అయితే ఈ విద్యా సంవత్సరం ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా ప్రారంభమై తరగతులు కరోనాకు ముందు స్థాయిలోనే జరుగుతున్న విషయం తెలిసిందే. జూన్ 15 నుండి కాలేజీలు ప్రారంభం అయ్యాయని, త్వరలోనే విద్యార్థులకు 100 శాతం సిలబస్ బోధన పూర్తవుతుందని ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు.
దీంతో సిలబస్ పై విద్యాశాఖ ఉన్నతాధికారులు, నిపుణనులతో ప్రభుత్వం సమీక్షించి వారి సూచనల మేరకు 100 శాతం సిలబస్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఇంటర్ వార్షిక పరీక్షలను, అలాగే సప్లిమెంటరీ పరీక్షలను వంద శాతం సిలబస్ తో పూర్తి స్థాయిలోనే పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.