ఐఏఎస్‌ల సర్దుబాటులో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మరీ విచిత్రంగా ఉంది. సందర్భం వస్తే రాష్ట్రాన్ని ఐఏఎస్‌ల కొరత వేధిస్తోందని కేంద్రానికి ఫిర్యాదు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉన్నవారిని ఉపయోగించుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు విధుల్లో ఉన్న కొందరికేమో అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. మరోవైపు మరికొందరినేమో మాత్రం నెలల తరబడి ఖాళీగానే కూర్చోబెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు డజను మంది ఐఏఎస్ అధికారులు పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో కొందరు ఏకంగా గత తొమ్మిది నెలలుగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తుండగా.. మరికొంత మంది రెండు నెలలకు పైగా వేచి చూస్తున్నారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా ఉన్న వాసం వెంకటేశ్వర్లు, అలాగే భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా ఉన్న అబ్దుల్ అజీమ్‌లను గతేడాది నవంబర్ 2020 లో బదిలీ చేసింది ప్రభుత్వం. కానీ వారికి ఇప్పటి వరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన అనిత రామచంద్రన్‌ను జూన్‌లో బదిలి చేసింది. ఆమె కూడా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తోంది. మొన్నటివరకు హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్‌గా చేసిన శ్వేత మొహంతిని కూడా కొద్ది రోజుల క్రితం బదిలీ చేసింది. అశ్చర్యంగా మేడ్చల్‌ని కూడా చూసుకోమని మెదక్ జిల్లా కలెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా ఉన్న ఎల్. శర్మన్‌ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ పోస్టును జూనియర్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టికి ఇచ్చింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కీలక శాఖలైన ఉన్నత విద్య, వ్యవసాయం, హెచ్ఎండీఏ వంటి ముఖ్యమైన విభాగాలకు పూర్తి స్థాయి అధిపతులే ప్రస్తుతం లేకపోవడం గమనార్హం.
తెలంగాణకు కనీసం 250 మంది IAS అధికారులు అవసరమని చాలా సార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారుకేసీఆర్. ప్రస్తుతం 130 మంది మంది మాత్రమే ఉన్నారని గుర్తుచేస్తూ వస్తున్నారు. కానీ ఉన్నవారినే తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.