కరోనా విజృంభణతో గతేడాది మార్చి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూతబడిన విద్యా సంస్థలను తెలంగాణ ప్రభుత్వం త్వరలో తెరిచేందుకు సిద్ధమవుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్, విద్యా సంవత్సరం నష్టపోకూడదన్న ఆలోచనతో ఇప్పటికే ఆన్‌లైన్ క్లాసులకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. ఇక ప్రత్యక్షంగా తరగతుల నిర్వహణకు అనుమతి ఇవ్వనుందని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విడతలవారీగా విద్యార్థులతో విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు. దీంతో తెలంగాణ కూడా అందుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ నెల 11న మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఏయే కోర్సులు, తరగతుల విద్యార్థులకు నేరుగా క్లాసులు నిర్వహించేది తేల్చనున్నారు. ఇందుకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారో తెలుసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించినట్టుగా తెలిసింది. జనవరి 18 వరకు సంక్రాంతి పండగ కూడా పూర్తి అవుతుండటంతో.. అప్పటి నుంచే క్లాసుల నిర్వహణకు ఓకే చెప్తారని భావిస్తున్నారు.