ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మరింత పట్టు బిగించింది. టెంపరరీగా 6 వేల మందిని తీసుకుని వారితో సర్వీసులు నడపాలని కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్టీసీలో సమ్మె తీవ్రరూపం దాల్చడం, చివరి హెచ్చరికకు కూడా సిబ్బంది స్పందించకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికిప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి తాత్కాలిక ప్రాతిపదికన 6 వేల మందిని నియమించుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. నాలుగు వేల మంది డ్రైవర్లు, 2 వేల మంది కండక్టర్లను అత్యవసర ప్రాతిపాదికన నియమిస్తారు. ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో బస్సుల్ని నడుపుతామని ఆర్టీసీ యాజమాన్యం చాలా నమ్మకంగా చెబుతోంది. ఇటువైపు నుంచి కూడా ప్రభుత్వం పెట్టిన డెడ్‌లైన్‌కు ఏ ఒక్క కార్మికుడు ఇంత వరకు విధుల్లో చేరలేదు. సాయంత్రం 6 గంటలల్లోపు విధుల్లో చేరకపోతే వేటు తప్పదని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించినా ఫలితం కనిపించకపోవడంతో ప్రభుత్వం మరిన్ని ప్రత్యామ్నాయాల వైపు ఫోకస్ పెట్టింది.
ఏపీ నుంచి వీలైనన్ని సర్వీసుల్ని రప్పించుకోవడం, తాత్కాలికంగా సిబ్బందిని తీసుకుని వారితో బస్సు సర్వీసుల్ని నడపడం, ఆ విధంగా ప్రజా వ్యతిరేకతను కొంత మేర తగ్గించుకోవడం.. వంటి అంశాలను సునిశితంగా పరిశీలిస్తోంది. దసరా పర్వదినాలు కావడం వల్ల తెలంగాణ ప్రజలు నగరాల నుంచి సొంత ఊళ్లకు పయనమవుతారు. వారికి ఆర్టీసీ బస్సులు మినహా అంతగా ప్రత్యామ్నాయాలు లేవు. ఏపీలో వున్నంతగా తెలంగాణా రూట్లలో ప్రయివేట్ ట్రావెల్స్ వారు సర్వీసులు నడపరు. దాంతో ఆర్టీసీ సమ్మెపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం కనిపిస్తోంది. ఇటు సమ్మె చేస్తున్న సిబ్బందిని తిడుతున్నారు. అటు ప్రభుత్వం మొండికేయడంతో పాలకుల్ని తిట్టిపోస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఆర్టీసీ యూనియన్ల మంకుపట్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇక ఉపేక్షించకుండా సమ్మె చేసే కార్మికులపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఒకరూ ఇద్దరూ శనివారం విధుల్లో చేరితే వారికి రక్షణ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కార్మిక సంఘాలతో చర్చలు జరపరాదని తుది నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీని ప్రభుత్వం రద్దు చేసింది.