దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేక ఫలితాలు రావడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. త్వరలోనే రెండు పట్టభద్రుల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో.. నిరుద్యోగులకు గాలం వేసే పనిలో పడింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. వీలైనంత త్వరగా ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీఎస్‌ను ఆదేశించారు.
అధికారికంగా.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో 50వేలకు పైనే ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పోలీసు, టీచర్ పోస్టులతో పాటు ముఖ్యమైన శాఖల్లో ఉద్యోగుల అవరముంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత భారీ స్థాయిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగులు భావించారు. కానీ ప్రభుత్వం ఉన్నవారితోనే సరిపెట్టి.. వారి నోట్లో మట్టికొట్టింది. ఇప్పటికే ఉద్యోగాల కోసం ఎదురుచూసి లక్షలాది మంది అభ్యర్థులు వయో పరిమితి దాటి.. ఎందుకూ పనికిరాకుండా పోయారు. కాగా ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు అవసరమో మరోసారి లెక్క తేల్చింది.. అందుకు అనుగుణంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.