టీచర్ల ఆస్తుల వివరాల విషయంలో తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గింది. దీనిపై సర్వత్రా వ్యతిరేకత రావడంతో ఉత్తర్వులను నిలిపివేసింది. విద్యాశాఖ ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. దీంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏటా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఉత్తర్వులు వచ్చాయి. దీంతో ఇకపై టీచర్లు ఇల్లు, ప్లాటు కొనాలన్నా, అమ్మాలన్నా సంబంధిత అధికారులకు చెప్పాలని కండిషన్ పెట్టారు. స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది.
ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఒకరిద్దరు చేసిన పనికి టీచర్లందరినీ ఆస్తుల వివరాలు కోరడమేంటని ప్రశ్నించారు. ఇటీవల ఓ ఉపాధ్యాయుడికి తన సోదరుడితో ఆస్తుల వివాదం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇటు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా దీన్ని ఖండించారు. ముందు ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు చెప్పి.. తర్వాత టీచర్లవి అడగాలని మండిపడ్డారు. అటు ఉపాధ్యాయ సంఘాలు, ఇటు ప్రతిపక్షాల నుంచి ఎదురుగాలి రావడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. విద్యాశాఖ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. నిలిపివేత ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని విద్యాశాఖ కార్యదర్శిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.