– తమిళిసై ప్రసంగంపై తగ్గిన సర్కార్
– హైకోర్టు జోక్యంతో సద్దుమణిగిన వ్యవహారం
– ఇరు వర్గాల న్యాయవాదుల చర్చలు
– గవర్నర్ ప్రసంగం ఉంటుందన్న ఏజీ
– అసెంబ్లీ సమావేశాల్లో మార్పులు, చేర్పులు
– మంత్రులు, అధికారులతో కేసీఆర్ సమాలోచనలు
– సీఎంతో భేటీ తర్వాత…
– రాజ్ భవన్ కు వెళ్లిన ప్రశాంత్ రెడ్డి, అధికారులు
అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగం వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గింది. హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం, రాజ్ భవన్ తరఫు న్యాయవాదుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు హైకోర్టుకు వివరించారు న్యాయవాదులు.
అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగబద్ద నిర్వహణకు నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు.ఇరువైపుల న్యాయవాదుల సమ్మతితో విచారణ ముగించింది హైకోర్టు. గవర్నర్ బడ్జెట్ ను ఆమోదించడం లేదంటూ హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది. ఈ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్ ధవే కోర్టుకు తెలిపారు.
లంచ్ మోషన్ మెన్షన్ చేసిన సందర్భంలో న్యాయస్థానం కీలక వాఖ్యలు చేసింది. ఇందులో న్యాయ వ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటుంది అని వ్యాఖ్యానించింది. లంచ్ మోషన్ అనుమతిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అడ్వకేట్ జనరల్ చెప్పడంతో అందుకు బెంచ్ అంగీకరించింది.
వచ్చే నెల 3న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈనెల 21న గవర్నర్ ను అనుమితి కోరింది. తమిళిసై నుంచి స్పందన లేకపోవడంతో 27న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి గవర్నర్ కు లేఖ రాశారు. బడ్జెట్ కు ఆమోదం తెలపాలని కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారుకు గవర్నర్ తమిళిసై సోమవారం లేఖ రాశారు. బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం ఉందా లేదా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత కోర్టులో ప్రసంగం ఉంటుందని ఏజీ తెలిపారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల మార్పులు, చేర్పులపై చర్చించారు. సీఎంతో భేటీ తర్వాత మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులు రాజ్ భవన్ కు వెళ్లారు. అక్కడ తమిళిసైని కలిశారు. ఉభయ సభలో ప్రోరోగ్, తిరిగి సమావేశమయ్యేందుకు నోటిఫికేషన్, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫారసు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులు తిరిగి ప్రగతిభవన్ కు వెళ్లారు.