మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరుపుతోంది. వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ ఎదుట అవినాష్ తరుపు న్యాయవాది ఉమా మహేశ్వరరావు వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్, దర్యాప్తు, కోర్టుల్లో జరిగిన పరిణామాలను కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు.
అవినాష్ నిందితుడని రికార్డుల్లో సీబీఐ ఎక్కడా చెప్పలేదు. గుండెపోటు అన్నంత మాత్రాన నేరం చేసినట్లే అనడం సరికాదు. అవినాష్ వైద్యుడో, పోలీసు అధికారో కాదు కదా? ఏ1 గంగిరెడ్డికి వివేకాతో వివాదాలు ఉన్నాయి. సునీల్, ఉమాశంకర్ తో వ్యాపారంలో విబేధాలున్నాయి.
తమ కుటుంబ మహిళల విషయంలోనూ వారికి వివేకా పై కోపం ఉంది. డ్రైవర్ గా దస్తగిరిని తొలగించిన వివేకా..ప్రసాద్ ను పెట్టుకున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి అవినాషే కారణమని వివేకా భావించారు. వివేకా ఓటమికి కారణాలను సాక్షులే వివరించారు.
స్థానిక నేతలు సహకరించకే ఓడిపోయారని సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. దస్తగిరి తీసుకున్న కోటిలో 46 లక్షలు మాత్రమే రికవరీ చేశారు. మిగతా డబ్బులు ఏమైయ్యాయో సీబీఐ చెప్పడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీ టికెట్ పై అవినాష్ ను సీబీఐ అనుమానిస్తోంది అని జస్టిస్ లక్ష్మణ్ వకేషన్ బెంచ్ ముందు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు.
వివేకా కేసులో సీబీఐ విచారణ ఉద్దేశపూర్వకంగా జరుగుతోందని వారు ఆరోపించారు. దస్తగిరి అనుచరుడు మున్నా స్టేట్మెంట్ రికార్డు చేయలేదని పేర్కొన్నారు. దస్తగిరి ముందస్తు బెయిల్‌ను సీబీఐ ఎందుకు అడ్డుకోలేదని వారు ప్రశ్నించారు.
దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి… సీబీఐ తమకు అనుకూలంగా స్టేట్మెంట్ రాయించుకుందని ఆరోపించారు.