రాష్ట్రంలోని పలు ప్రభుత్వ విద్యా సంస్థల్లో సరైన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల మూత్ర శాలలు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్స్ లేకపోవడంతో రోజు దాహం వేసినా ఇంటికి వెళ్లే వరకు నీళ్లు తాగడం లేదని విద్యార్థినులు కన్నీళ్లు పెట్టుకుంటున్న వార్తలు మనం వింటూనే ఉన్నాం.
తాజాగా ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 700 మంది విద్యార్థినులకు ఒకే మూత్ర శాల ఉండటంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలపై ఇటీవల ఎల్‌ఎల్‌బీ విద్యార్థి మణిదీప్ లేఖ రాశారు. దీన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన వసతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో తక్షణమే బాలికలకు మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్ బోర్డు కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు పంపించింది. విద్యాసంస్థల్లోని వసతులపై ఏప్రిల్ 25లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.