జీవోల విషయంలో దాగుడుమూతలు ఆడుతూ కేసీఆర్ సర్కార్ మరోసారి హైకోర్టుకు దొరికిపోయింది. మొన్నటికి మొన్న కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్లు దొడ్డిదారిలో మళ్లించే ప్రయత్నం చేస్తూ కోర్టుతో చివాట్లు తిన్న ప్రభుత్వం.. తాజాగా మరో జీవో విషయంలో మొట్టికాయలు వేయించుకుంది.
దళిత బంధు పథకం నిబంధనలపై సీఎం కేసీఆర్ రోజుకో మాట చెప్తుండటంతో.. తాజాగా కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దళత బంధు పథకానికి సంబంధించిన నిబంధనల జీవో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో లేదని పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మరోసారి హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బంది ఏంటని నిలదీసింది. జీవో ఇచ్చిన 24 గంటల్లో వెబ్‌సైట్‌లో ఉంచాలని తేల్చి చెప్పింది.
వాసాలమర్రిలో దళిత బంధు అమలుపై వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ వేసిన పిల్ పై సీజే హిమాకోహ్లీ, జస్టిస్ విజయ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. నిబంధనలు ఖరారు చేయకుండానే దళిత బంధుకు నిధులు విడుదల చేశారని పిటిషనర్ తరపు న్యాయవాదులు ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు వర్తిస్తుందని.. నిబంధనలు ఖరారు చేసినట్లు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు వివరించారు. కానీ నిబంధనలకు సంబంధించిన జీవో వెబ్ సైట్‌లో లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో జీవోలన్నీ 24 గంటల్లో వెబ్ సైట్ లో పెట్టాలని ఆదేశిస్తూ.. ఏజీ వివరణ నమోదు చేసింది హైకోర్టు. వాసాలమర్రిలో దళిత బంధు పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించింది.