ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీలో మరో అడుగు ముందుకు పడింది. కేసీఆర్ ప్రకటించిన 80వేల ఉద్యోగాల్లో.. తొలివిడతగా 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు శాఖల వారీగా నియామకాలకు ఓకే చెప్తూ జీవోలు జారీ చేసింది.
గ్రూప్-1, హోంశాఖ, జైళ్లు, రవాణా, వైద్య, ఆరోగ్య శాఖల్లోని ఖాళీలకు సంబంధించి ఈ జీవోలు ఉన్నాయి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఆదేశాల తర్వాత ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఎక్సైజ్ , క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర మంత్రులతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులతో పలు ధపాలుగా చర్చించారు. ఈ క్రమంలోనే 30,453 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ పచ్చాజెండా ఊపింది.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు అంగీకరించిన ఆర్థికశాఖ.. ఇందుకు అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేసింది. మిగిలిన శాఖల్లోని ఖాళీలపై కూడా సమీక్షలు జరిపి అనుమతులు ఇస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఉద్యోగాల కోసం 8ఏళ్లుగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. కళ్లు కాయలు కాసేలా చూసినా ఇన్నాళ్లూ కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీని వాడుకుంటున్నారే గానీ ఎలాంటి ముందడుగు వేయలేదు. ఈమధ్యే ఖాళీల లెక్కలన్నీ వివరించారు. నోటిఫికేషన్లు వచ్చేస్తాయని తెలిపారు. అందులోభాగంగా 30,453 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చింది ఆర్థిక శాఖ.