తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే, పోలీస్, గ్రూప్-1 నోటిఫికేషన్ లు వెలువడ్డాయి. వాటి దరఖాస్తు ప్రక్రియ పూర్తయంది. ఈ సమయంలో నిరుద్యోగులకు మరో నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 1,326 డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టులు 751, ట్యూటర్ పోస్టులు 357, అసిస్టెంట్ సివిల్ సర్జన్ జనరల్ పోస్టులు 211, అసిస్టెంట్ సివిల్ సర్జన్ ప్రివెంటివ్ మెడిసిన్ పోస్టులు 7 ఉన్నాయి. వీటి కోసం అభ్యర్థులు జూలై 15 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
నోటిఫికేషన్ దరఖాస్తు వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు కొనసాగుతుంది.
ఇటీవలే మంత్రి హరీశ్ రావు వైద్య ఆరోగ్య శాఖలో 1,326 పోస్టులకు నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పలు విభాగాల నుంచి ఖాళీల సమాచారం సేకరించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.