హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉన్న బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థపై రెండో రోజు ఐటీ రెయిడ్స్ కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మొదలైన సోదాలు రాత్రి వరకూ సాగాయి. అనంతరం గురువారం ఉదయం నుంచి మళ్లీ సోదాలు చేస్తున్నారు అధికారులు. కాజీపేటలోని ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 40 కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
సంస్థ అధికారులు, సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది ఫోన్లను సీజ్ చేశారు. గురువారం ఉదయం నుంచి ప్రధాన కార్యాలయంతో పాటు సంస్థ సీఈవో శౌరి రెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సంస్థకు నిధులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి? అనే దానిపై ఆరా తీస్తున్నారు. కంప్యూటర్ల హార్డ్ డిస్క్ లతో పాటు కొన్ని కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు.
ఈ ఐటీ దాడులపై మంత్రి ఎర్రబెల్లి దాయకర్ రావు రియాక్ట్ అయ్యారు. మూడు దశాబ్దాలుగా దేశ, విదేశాల నుంచి నిధులు సేకరించి, ప్రజా సేవ చేస్తున్న బాల వికాస సంస్థపై ఐటీ దాడులు బాధాకరమన్నారు. బాల వికాస క్రిస్టియన్ మిషనరీ సంస్థ అయినందునే కేంద్రం ఐటీ దాడులు చేయిస్తున్నదని ఎర్రబెల్లి మండిపడ్డారు. బాల వికాస సంస్థపై దాడులను ఖండించారు. క్రైస్తవ మిషనరీ సంస్థలు దేశంలో సేవా కార్యక్రమాలు చేయకుండా కేంద్రం కుట్ర చేస్తున్నదని విమర్శించారు ఎర్రబెల్లి
కాగా తెలంగాణ రాష్ట్రంలో బాలవికాసకు మంచి పేరు ఉంది. ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందిస్తోంది. దీంతో పాటు గ్రామీణ విద్యార్థుల చదువులకు సాయం చేయడం, మహిళలకు వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహిస్తుంది.