టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పిచ్చిపిచ్చాగా మాట్లాడొద్దని హెచ్చరించారు. తాను భూ కబ్జాలకు పాల్పడినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తన తండ్రి 1600ఎకరాలు సంపాదించారని.. ఇప్పడు వంద ఎకరాలే మిగిలిందని తెలిపారు. జనగామ, వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నానని చెప్పి కార్లలో తిరుగుతున్నారంటూ ఆరోపించారు. నాకు చదువు రాదు అంటున్నాడు.. అవును నేను ఇంటర్ మీడియట్ వరకే చదివినాను.. అదే చాలా సార్లు చెప్పాను అంటూ మంత్రి పేర్కొన్నారు.
మీలా ప్రజలను ఎలా మోసం చేయాలో చదవలేదని సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఓటమే ఎరుగని నాయకున్నని, ఎక్కడ పోటీ చేసినా గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశాడన్నారు. తన రాజకీయ చరిత్రలో తనపై చిన్న కేసు కూడా లేదన్నారు. కేసీఆర్ గురించి, నా గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదంటూ ఎర్రబెల్లి తేల్చి చెప్పారు.
అనంతరం వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై నిప్పులు చెరిగారు మంత్రి ఎర్రబెల్లి. షర్మిల పిచ్చి పిచ్చి మాటలు మానుకోవాలంటూ హెచ్చరించారు. ప్రజల్లో మీకు స్పందన లేదని, మీ పాదయాత్ర బంద్ చేయాలంటే నిమిషం పట్టదని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి రేవంత్ రెడ్డికి, షర్మిలకు కనపడటం లేదా అని ప్రశ్నించారు.
కరువు గడ్డ జనగామకు నీళ్లు తెచ్చిన ఘనత మాదని గొప్పగా చెప్పుకున్నారు. వీరిద్దరూ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. 500 మందిని కాంట్రాక్ట్ తీసుకొని పాదయాత్రలు చేస్తున్నారని విమర్శలు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో డబ్బులు విడుదల చేసి కాల్వలతో రిజర్వాయర్లు నింపామని చెప్పారు. మహారాష్ట్ర నుండి, కాళేశ్వరం నుండి ఉమ్మడి వరంగల్ కు పుష్కలంగా నీళ్లు వస్తున్నాయని తెలిపారు రేవంత్ రెడ్డి.