సీఎం కేసీఆర్ పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి నిర్మల మాటల్లో నిజాయితీ లేదన్నారు. దేశంలో నెలకొన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో పూర్తి ఆధారాలతో మాట్లాడారని చెప్పుకొచ్చారు. వాస్తవాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్తే కేంద్ర మంత్రులను నిద్ర పట్టడం లేదన్నారు. కేంద్రం, తెలంగాణకు ఇచ్చింది గోరంత చెప్పేది కొండంత అంటూ విమర్శించారు.
మెడికల్ కాలేజీ గురించి కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. వారిలో వారికే క్లారిటీ లేదంటూ ఎద్దేవా చేశారు. కరీంనగర్, ఖమ్మంలో మెడికల్ కాలేజీలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. వేరే రాష్ట్రాలకు ఒక నీతి.. తెలంగాణకు ఒక నీతి.. నా అంటూ ప్రశ్నించారు. మెడికల్ కళాశాలలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తున్నామన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఫైనాన్స్ కమిషన్ నిర్ణయాలను తుంగలో తొక్కి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారన్నారు. జీఎస్టీ నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు నిధులను ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ‘డేట్ టూ జీడీపీలో మేము అప్పులు తగ్గిస్తే మీరు పెంచుకుంటూతున్నారు’ అని విమర్శించారు. రాష్ట్రంలో ఈ మాత్రం అప్పులు పెరగడానికి కారణం కేంద్రమే అని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా పొరపాటు లేదని.. నూటికి నూరు శాతం నిజమని స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇవ్వమని అడిగితే.. మీరు ఇవ్వమని మొండి చేయి చూపిస్తున్నారు. అందుకే తెలంగాణ నిధులతో వరంగల్ లో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మిస్తామని అన్నాం. ఇక మీకు ఎందుకు ఓటు వేయాలో కరీంనగర్, వరంగల్ ప్రజలు తేల్చుకుంటారన్నారు మంత్రి హరీష్ రావు.