తెలంగాణలో అసెంబ్లీలో వసతుల గురించి మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ప్రాంగణంలో బీజేపీ సభ్యులకు వసతి కల్పించడం లేదంటూ ఆరోపించారు. బీజేపీ సభ్యులకు టిఫిన్ చేసేందుకు కూడా అవకాశం లేదన్నారు. ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ తినేందుకు కూడా చోటు లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. జీఎస్డీపీలో 25 శాతానికి మించి అప్పులు చేయకూడదన్నారు. బీసీల కోసం బడ్జెట్ లో పెట్టిన నిధులు విడుదల చేయడం లేదన్నారు. కేంద్రం మద్దతు ధరల కోసం రాష్ట్రంలో రూ.95 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు ప్రతినెలా చెల్లించాలని డిమాండ్ చేశారు ఈటెల రాజేందర్.
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు ఏమీ చేయొద్దన్నట్లుగా విపక్ష నేతలు మాట్లాడుతున్నారన్నారు. గతంలో బడ్జెట్ సమావేశాలప్పుడు నేతలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపేవారన్నారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ తరచూ నిసన ప్రదర్శనలు జరిగేవి.. కానీ అలాంటివి ఏమీ ఇప్పుడు కనబడటం లేదన్నారు
గతంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ నీటి వల్ల ఎముకలు వంకర్లు పోయి బాధపడేవారు. ప్రజల గుండెల మీద ఫ్లోరైడ్ బండలు తొలగించిందెవరు? మిషన్ భగీరథ పథకం రూపంలో దేశం ముందు ఒక నమూనా నిలిపామన్నారు హరీష్ రావు.