కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. గురువారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. యాదాద్రిలో ఒకరోజు ముందుగానే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయని అన్నారు. 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏమో పేలుస్తా అంటే.. బీజేపోడు కూలుస్తా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరే ఆలోచించుకోండి మీకు కూల్చే నాయకులు కావాలో.. ప్రజల అవసరాలు తీర్చే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి కావాలో అని సూచించారు. అద్భుతమైన సేవలందించే బీఆర్ఎస్ దేవుడిని వదులుకోవద్దన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఒక్క ప్రభుత్వ కాలేజీ లేదంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో మాత్రం వచ్చే ఏడాదిలో తొమ్మిది మెడికల్ కాలేజీలు రానున్నాయని తెలిపారు. వాటిలో ఒకటి యాదాద్రికి కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు.
బీజేపీ పాలిస్తున్న ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన కరెంటు కోతలు ఉన్నాయని ఆరోపించారు. కానీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క గుంట భూమి కూడా ఎండిపోకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తుందని చెప్పారు. ఇక ఏప్రిల్ మొదటి వారంలో గొంగిడి సునీత, ఎమ్మెల్యే విప్ చేతుల మీదుగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ను ప్రారంభించబోతున్నామని ప్రకటించారు మంత్రి హరీష్ రావు.