దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి. గురువారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వామపక్ష పార్టీల సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విపక్షాల గొంతులు నొక్కేందుకే బీజేపీ రాజ్యాంగ సంస్థలను వినియోగిస్తుందని ఆరోపించారు. బీజేపీని నిలువరించాల్సిన అవసరం ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల రూపంలో వచ్చిందన్నారు. ఆ శక్తి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు. అందుకు తోడ్పాటునందించే ప్రగతి శీల శక్తులను కలుపుకొని పోవాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. అందుకు మునుగోడు ఉప ఎన్నికలనే వేదికగా ఎంచుకొని వామపక్షాలతో కలసి బీజేపీపై పోరాటానికి శ్రీకారం చుట్టమన్నారు. దేశంలో కాంగ్రెస్ బలహీన పడిందని బీజేపీని బలంగా వ్యతిరేకించే శక్తులను కలుపుకోవడంలో భాగంగ వామపక్షాలతో కలసి పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు.
ఈ ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో మంత్రి జగదీశ్ రెడ్డి చర్చించారు. మునుగోడు ఉపఎన్నికలో వామపక్షాలతో కలిసి ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై సమీక్షా సమావేశం నిర్వహించామన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసుకుని కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించుకున్నామని ఆయన పేర్కొన్నారు. అలాగే రేపటి నుంచి 14 వరకు మునుగోడులో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. ఈలోగా అభ్యర్థి ప్రకటన, నామినేషన్ దాఖలుపై ఆలోచనా ధోరణిలో గులాబీ బాస్ ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారా? లేక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికలకు పోతారా? అన్న సందిగ్ధంలో క్యాడర్ ఉంది. తెలంగాణ సెంటిమెంట్ పదం లేకుండా.. బీఆర్ఎస్ పేరుతో నామినేషన్ వేస్తే ఎలా అన్న సందిగ్ధంలో క్యాడర్ ఉంది.
దీంతో టీఆర్ఎస్ పేరుతోనే నామినేషన్లు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహం అమలు చేస్తోంది. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించింది. ప్రతి యూనిట్ కు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇన్ చార్జ్ బాధ్యతలను అప్పగించింది. 14 మంది మంత్రులు, ముగ్గురు ఎంపీలు, 54 మంది ఎమ్మెల్యేలను ఇన్ ఛార్జ్ గా నియమించింది. ఏడుగురు ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ లకు పూర్తి బాధ్యత అప్పగించింది.
కాగా ఈ సమావేశంలో సీపీఎంకు చెందిన మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐకి చెందిన మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, ఉజ్జిని యాదగిరి రావులతో పాటు సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, యాదాద్రి జిల్లా కార్యదర్శి జహంగీర్, సీపీఐ నల్లగొండ, యాదాద్రి జిల్లా కార్యదర్శులు నెల్లికంటి సత్యం, గోదా శ్రీరాములు, టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల ఇంచార్జ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.