కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటర్ ఇచ్చారు. బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. జీవన్ రెడ్డికి అసలు అవగాహన ఉందా?.. కాలుష్యంపైన ప్రభుత్వానికి శ్రద్ధ ఉందన్నారు. జీవన్ రెడ్డి తీరువల్ల ధర్మపురి ప్రజలకే నష్టమని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
భూమిని చదును చేయడానికి వెళ్తే.. ప్రాజెక్టుకు శంకుస్థాపన అంటారా?, దొంగచాటున చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రాజెక్టు కట్టకపోతే తనకు పోయేదేం లేదని, ఇథనాల్ కు ఎవరి భూమి తీసుకోవడం లేదన్నారు. మీలా ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు తాము చేయబోమన్నారు. ఈ విషయంలో తాను బహిరంగ చర్చకు సిద్ధమని.. జీవన్ రెడ్డి వస్తారా? అంటూ కొప్పుల ఈశ్వర్ సవాల్ చేశారు.
కాగా జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో ఇథనాల్ ప్రాజెక్ట్ వద్దంటూ మూడు రోజులుగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రియాక్ట్ అవుతూ.. మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చేతనైతే షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ చేశారు. రూ.750 కోట్ల ప్రాజెక్టుకు దొడ్డిదారిన ఎందుకు కొబ్బరికాయ కొడుతున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదన్నారు.
కాలుష్యం వెదజల్లే ఇథనాల్ పరిశ్రమ ఎందుకో చెప్పాలన్నారు. ధర్మపురి ప్రజల గోడు ఈ ప్రభుత్వానికి పట్టదా? ఎల్లంపల్లి నీళ్లు కాలుష్యం అయితే ఎవరిది బాధ్యత? అని నిలదీశారు. ధర్మపురి రైతుల పొట్టగొట్టి ఎవడి కడుపు నింపాలనుకుంటున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కామెంట్స్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ రియాక్ట్ అయ్యారు.