నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అని పేర్కొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురువారం కేటీఆర్ హుజూర్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ కట్టిన డబ్బులు తీసుకెళ్లి.. ఇతర రాష్ట్రాల అభివృద్దికి వాడుతున్నారని మండిపడ్డారు. తాను చెప్పింది తప్పని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. లేకపోతే కిషన్ రెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు కేటీఆర్.
కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాల మాట పక్కన పెడితే.. ఉన్న వాటిని ఊడగొడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. మంచి ఎవరు చేస్తున్నారన్నది ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు కేటీఆర్.
హుజూర్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ది పరుగులు పెడుతోందని అన్నారు. హుజూర్ నగర్ అభివృద్దికి రూ.3వేల కోట్ల నిధులు ఇచ్చామని చెప్పారు. సాగునీటి రంగంలో కొత్త విప్లవానికి శ్రీకారం చుట్టామన్నారు. నియోజకవర్గంలో కొత్త, పాత లిఫ్టుల పనుల కోసం రూ.2వేల కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. హుజూర్ నగర్ కు రెవెన్యూ కార్యాలయాన్ని తీసుకొచ్చామని చెప్పారు. పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.
గిరిజన తండాల్లో రూ.35వేల కోట్లతో రోడ్లను నిర్మించామని ఆయన వెల్లడించారు. త్వరలోనే ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో పూర్తిస్తాయిలో ఈఎస్ఐ ఆస్పత్రిని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అలాగే గిరిజన సంక్షేమం కోసం రూ.3.5 కోట్లతో నిర్మించిన బంజారా భవన్ ను త్వరలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.