టెక్స్ టైల్స్, చేనత రంగంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టెక్స్ టైల్స్, చేనత రంగంపై జీఎస్టీ గురించి ప్రస్తావించారు. నేతన్నల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలని కోరినా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కేంద్ర బడ్జెట్ లో కొన్నేళ్లుగా తెలంగాణకు అందుతున్నది శూన్యమన్నారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు, సిరిసిల్ల మెగా పవర్ లూం క్లస్టర్ కు నిధులు ఇవ్వాలన్నారు. రానున్న బడ్జెట్ లోనైనా టెక్స్ టైల్ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు అందివ్వాలని కేటీఆర్ కోరారు. ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని, ప్రతిసారి ఆర్థిక శాఖ మంత్రులు మారుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బడ్జెట్ లో టెక్స్ టైల్ రంగానికి దక్కుతున్నది శూన్యమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. టెక్స్ టైల్స్, చేనేతరంగంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలన్నారు. బ్లాక్ లెవల్ హ్యాండ్ లూం క్లస్టర్ల ఏర్పాటుకు నిధులు ఇవ్వాలన్నారు.
టెక్స్ టైల్, నేతన్నల పరిస్థితిపై కేంద్రానికి కనీస అవగాహన లేదని విమర్శించారు. నేతన్నల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నానన్నారు. చిన్న దేశాలతో పోటీపడేందుకు కూడా కేంద్రానికి ఎనిమిదేళ్ల కాలం సరిపోలేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఐదేళ్ల కిందటే ఒక రాష్ట్రంగా అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేవాలతో పోటీపడేలా భారీ మౌలిక వసతుల కల్పన చేపట్టి కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినప్పటికీ 8 ఏళ్లలో ఇలాంటి ఒక భారీ ప్రయత్నాన్ని కేంద్రం చేయకపోవడం బాధకరమన్నారు. ఈ మెగా టెక్స్ టైల్ పార్కులో జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్ధలు పెట్టుబడి పెడుతున్నాయని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన చేయకపోవడం, పాలసీ ప్రోత్సాహకాలు లేకపోవడం వలన పొరుగు దేశాలు బంగ్లాదేశ్, శ్రీలంక వంటి చిన్న దేశాల కన్నా టెక్స్ టైల్ రంగంలో ఇండియా వెనుకబడిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. సుమారు 1600 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ భారీ టెక్స్ టైల్ పార్క్ ఖర్చులో కేంద్రం వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. ఈసారి బడ్జెట్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ మౌళిక వసతులు కల్పన, ఇతర కార్యక్రమాల కోసం కనీసం 900 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు 5000పైగా పవర్లూమ్ మగ్గాలు ఉంటే, కేంద్ర ప్రభుత్వం నిధులు అందించే వీలుందని, ఈ మేరకు కేంద్రం నిధులు అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సిరిసిల్ల పవర్లూమ్ క్లస్టర్ లో 25 వేలకు పైగా పవర్లూమ్ మగ్గాలు ఉన్నాయన్నారు. ఈ బడ్జెట్ లో దీన్ని ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ గా గుర్తించి, ఈ ప్రాజెక్టు కోసం కనీసం 100 కోట్ల రూపాయల కేంద్ర నిధులను అందించాలని కేటీఆర్ కోరారు.
సిరిసిల్ల మరమగ్గాల ఆధునికీకరణ, వాల్యూ చైన్ బలోపేతం, మార్కెట్ అభివృద్ధి, నైపుణ్య అభివృద్ధి, కెపాసిటీ బిల్డింగ్, ప్రాజెక్ట్ మానిటరింగ్ వంటి ఖర్చుల కోసం సుమారు 990 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఇందులో సింహభాగాన్ని ఈ బడ్జెట్ లో కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో పవర్ లూమ్ పరిశ్రమతో పాటు చేనేత పరిశ్రమకు కూడా తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత ఉందని తెలిపిన మంత్రి కేటీఆర్, రాష్ట్రంలో సుమారు 40వేల హ్యాండ్లూమ్ కార్మికులు పని చేస్తున్నారన్నారు. ఇందులో యాదాద్రి భువనగిరి, గద్వాల్, వరంగల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారన్నారు.