సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రకటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి ప్రైవేటీకరణలేదని ప్రధాని మోడీ కల్లబొల్లి మాటలు చెప్పారని మండిపడ్డారు. 4 బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు లోక్ సభలో ప్రకటించారని పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధిపై అసూయతోనే ప్రైవేటీకరణ యోచన అన్నారు. తెలంగాణ విజయ ప్రస్థానాన్ని దెబ్బకొట్టాలనే కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటీకరణ అంటే తెలంగాణను కుప్పకూల్చడమేనన్నారు కేటీఆర్. తెలంగాణతో పాటు దక్షిణాది థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణిదే కీలక పాత్రన్నారు.
గనులు కేటాయించకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను దివాలా తీయించిన విధంగానే సింగరేణిపై కూడా కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
సొంత రాష్ట్రం గుజరాత్ కి ఓ నీతి.. తెలంగాణకి మరొక నీతిని అమలు చేస్తున్నారా? దీనిపై మోడీ స్పష్టత ఇవ్వాలన్నారు. తెలంగాణ పట్ల ఈ పక్షపాతం ఇంకెన్నిరోజులు? అంటూ నిలదీశారు. ఇది కేవలం సింగరేణి కార్మికుల సమస్య కాదని.. తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశమన్నారు. సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు మంత్రి కేటీఆర్.