బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. టీఆర్ఎస్ తరపున మునుగోడులో ప్రచారానికి వెళ్లిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మునుగోడులోని టీఆర్ఎస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచనలు చేస్తూనే.. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక అట్టర్ ప్లాఫ్ ఎమ్మెల్యే అని పేర్కొన్నారు.
నియోజకవర్గ అభివృద్దిని, ప్రజల కష్ట సుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం తన కాంట్రాక్టుల గురించి మాత్రమే ఆలోచించే ఫక్తు రాజకీయ వ్యాపారి రాజగోపాల్ రెడ్డి అని విమర్శించారు కేటీఆర్. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు గతంలో అనేక హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా చేతులెత్తేసిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు మళ్లీ ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
బీజేపీ ఇచ్చిన వేల కోట్ల కాంట్రాక్టు కమీషన్ డబ్బులతో బైకులు, కార్లతో పాటు ఇతర విలువైన వస్తువులను ఓటర్లకు రాజగోపాల్ రెడ్డి పంచుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మునుగోడు ఓటర్లు బీజేపీకి, రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి వైఫల్యాలు, కాంట్రాక్టులను వివరిస్తూనే.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లో ప్రచారం చేయాలని కేటీఆర్ నేతలకు సూచించారు.
అలాగే టీఆర్ఎస్ పార్టీ గత ఎనిమిది సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి చేసిన కార్యక్రమాలను వివరించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. అక్రమ కాంట్రాక్టులతో సంపాదించిన వేల కోట్ల రూపాయల ధన బలంతో ఇన్నాళ్లు ప్రజలను పట్టించుకోని రాజగోపాల్‌రెడ్డే.. ఈ మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. రాజగోపాల్‌రెడ్డి ధన బలానికి.. మునుగోడు ప్రజల బలానికి మధ్య మునుగోడు ఎన్నిక జరుగుతోందన్నారు. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం అనేక హామీలిచ్చి వాటిలో ఏ ఒక్కదాన్ని నెరవేర్చకుండా చేతులెత్తేసిన రాజగోపాల్ రెడ్డి.. ఈ ఉప ఎన్నిక సందర్భంగా మరోసారి ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మంత్రి కేటీఆర్.