చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బన్సీలాల్ పేట మెట్ల బావిని స్థానికులందరూ కలిసి అపురూపంగా కాపాడుకోవాలని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ కి యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు తెస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. బన్సీలాల్ పేట్ మెట్ల బావిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. చరిత్ర, వారసత్వ చిహ్నాల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రూ.10 కోట్లతో మెట్లబావి సుందరీకరణ పనులు జరిగాయని చెప్పారు. కళలు, కళాకారులు, సంస్కృతికి చిహ్నంగా మెట్లబావి మారాలని మంత్రి కేటీఆర్ సూచించారు. చెత్త పారేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా స్థానికులదే. మెట్ల బావిని కాపాడుకుంటూ హైదరాబాద్ నగరానికి స్ఫూర్తిగా నిలవండని కేటీఆర్ స్థానికులకు పిలుపునిచ్చారు.
ఈ ఎనిమిదేండ్ల కాలంలో హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఇతర పనులు ప్రారంభించుకున్నాం. కానీ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు సంతోషం కలుగుతుంది. ఇవాళ అట్లాంటి సందర్భం ఉంది. ఒక నగరం, పట్టణం.. స్టీల్ కాంక్రీట్ నిర్మాణాలను బట్టి మాత్రమే కాదు. నగరం చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రతిబింబించే ఈ మెట్ల బావి లాంటి కట్టడాలను కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు అందించిన వాళ్లం అవుతాం అని కేటీఆర్ తెలిపారు. గత 13 నెలల నుంచి అహర్నిశలు శ్రమించి బన్సీలాల్‌పేట మెట్ల బావికి కొత్త వైభవాన్ని అందించిన వారందరికీ అభినందనలు తెలిపారు.
టన్నుల కొద్ది చెత్తను మీ స్వహస్తాలతో తీసి ఇంతటి అందమైన కానుకను హైదరాబాద్‌కు అందించిన పారిశుద్ధ కార్మికులకు, జీహెచ్ఎంసీ సిబ్బంది, స్థానికులకు హృదయపూర్వకంగా శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. బన్సీలాల్ పేట్ మెట్ల బావిని భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునేలా ఆధునీకరణ, మ్యూజియం, యాంఫీ థియేటర్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కులీ కుతుబ్ షా టూంబ్స్ వద్ద 6 మెట్ల బావుల ఆధునీకరణ, మెట్ల బావులు పునరుద్ధరించిన ఆగాఖాన్ ఫౌండేషన్ కు యునుస్కో అవార్డు వచ్చిందన్నారు. చరిత్ర, వారసత్వ చిహ్నాల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు కేటీఆర్.
కాగా మన్ కీ బాత్ కార్యక్రమంలో లో బన్సీలాల్ మెట్లబావి ప్రస్తావన వచ్చింది. సహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ మెట్ల బావి పూర్వ వైభవానికి చర్యలు చేపట్టిందన్నారు. మట్టి, చెత్త, వ్యర్థాలతో పూడుకుపోయిన బావిని 8 నెలల పాటు శ్రమించి.. రూపులు రేఖలు మార్చివేశారు. అభివృద్ధి పర్యటనకు ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. భూగర్భజలాల సంరక్షణపై మన్ కీ బాత్ లో మాట్లాడే క్రమంలో.. ప్రధాని మోడీ ఈ బన్సీలాల్ పేట మెట్లబావి గురించి ప్రస్తావించారు. చారిత్రక మెట్ల బావికి పునర్ వైభవం తీసుకొచ్చారు. ఆ బావి అలనాటి వైభవాన్ని చాటుతోందన్నారు.