ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని తెలిపారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అమెజాన్ ఎయిర్ కార్గో విమానమైన ప్రైమ్ ఎయిర్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ సియాటెల్ లోనే కాదు హైదరాబాద్ లో కూడా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అమెజాన్ సంస్థ హైదరాబాద్ లో భారీగాపెట్టుబడులు పెడుతుందని అది ఇక నుంచి కొనసాగుతుందని తెలిపారు.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. గత ఏడేళ్లుగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా అమెజాన్ బృందాన్ని అభినందించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా రూ.36 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెడుతుందని చెప్పారు మంత్రి కేటీఆర్.
కాగా రెండు రోజుల క్రితమే దావూస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన కేటీఆర్.. సోమవారం అమెజాన్ ఎయిర్ కార్గో విమానమైన ప్రైమ్ ఎయిర్ ను ప్రారంభించారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే.
గత కొన్ని రోజులుగా ఆయన పారిశ్రామిక వేత్తలతో బిజీగా గడిపారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి 21 వేల కోట్ల రూపాయల పెట్టబడులు వచ్చేలా చర్చలు జరిగినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.