అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పని చేస్తోందని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.10 లక్షలతో ఏర్పాటు షాదీఖానా భవనం, తుంగపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాలను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. అలాగే జిల్లెల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించారు. అక్కడ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అభినందించారు కేటీఆర్. ఆ తర్వాత విద్యార్థులతో మాట్లాడి.. వారు రూపొందించిన ప్రాజెక్టులను గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు పల్లె దవాఖాన, బస్తీ దవాఖాన, హెల్త్ ప్రొఫైల్, ఉచిత డయాగ్నసిస్ సేవలు, కేసీఆర్ కిట్ వంటి వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. దేశంలో అత్యధికంగా ఆశా వర్కర్లకు జీతాలు ఇస్తోన్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనన్నారు.
గుజరాత్ లో కంటే తెలంగాణలోనే అధిక వేతనాలు ఇస్తున్నామన్నారు. కరోనా సంక్షోభం వల్ల వేతనాలు పెంచాలని ఉన్నా పెంచలేక పోయామన్నారు. ఆర్థిక పరిస్థితులు కుదుట పడగానే ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామన్నారు కేటీఆర్. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే తలమానికంగా నిలుస్తాయన్నారు. పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకూ పథకాలతో పేద ప్రజలు లబ్ధిపొందుతున్నారన్నారు.
మతం, చరిత్ర పేరుతో ఓట్లు అడిగే వారి మాటలు నమ్మొద్దని కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో వెయ్యి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వివిధ రకాల వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.