కేఎంసీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి కుటుంబాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. బుధవారం ప్రీతి ఇంటికి వెళ్లిన ఆయన.. ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మహిళా దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీతి కుటుంబాన్ని కలిశారు. ప్రీతి ఘటనలో నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దంటూ వరంగల్ సీపీ రంగనాథ్ ను కేటీఆర్ ఆదేశించారు. ప్రీతి మృతి ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని, ప్రీతి కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు కేటీఆర్.
కాగా గతంలో ప్రీతి కేసుపై కేటీఆర్ స్పందించారు. ప్రీతి ఘటనను రాజకీయం చేస్తున్నారని తప్పుబట్టారు. ప్రీతిని హత్య చేసిన వారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు సైఫ్ అయినా.. సంజయ్ అయినా.. ఎవరినీ వదలమని హెచ్చరించారు.
ఇటీవల హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన ప్రీతి తుదిశ్వాన విడిచిన విషయం తెలిసిందే. డాక్టర్ల బృందం ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ప్రీతి తన సీనియర్ ఎంఏ సైఫ్ వేధింపులు భరించలేక ఫిబ్రవరి 22న ఉదయం మత్తు ఇంజక్షన్ తీసుకుంది.
ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే పాలకుర్తి నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ తరఫున రూ.20 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రీతి కుటుంబ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు.