తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సంగారెడ్డి జిల్లా యంత్రాంగం కదిలింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో మరో భారీ భూకంభకోణం బయటపడింది. గ్రామంలో 261 సర్వే నంబర్ లోని భూమి అన్యాక్రాంతమైందని ఆ ఊరి సర్పంచ్ ఫిర్యాదు చేశారు. అలాగే మంత్రి కేటీఆర్ కు కూడా ఆ ఊరి సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ విజ్ఞప్తిపై స్పందించిన కేటీఆర్.. అధికారులను ఆదేశించారు. దీంతో అన్నారం గ్రామ రైతులతో అధికారులు సమావేశమయ్యారు.
జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, డీఎల్ పీఓ సతీష్ రెడ్డి, తహశీల్దార్ సుజాతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సర్వేయర్లతో సోమవారం నుంచే సర్వే చేయించి రెండు రోజుల్లో సర్వే రిపోర్టును కలెక్టర్ కు అందజేస్తామన్నారు. ఈ సర్వేకు సహకరించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. 118 మందికి త్వరలోనే ఆన్ లైన్ పట్టా సర్టిఫికేట్లను అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
గుమ్మడిదల మండలం అన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ 261 లోని ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసేందుకు భూ బకాసురుల భారీ స్కెచ్ వేసినట్టు ఆరోపణలు పెద్దఎత్తున వస్తున్నాయి. రియాల్టర్లు, పెట్టుబడిదారులతో రెవెన్యూ అధికారులు, వివిధ పార్టీల లోకల్ లీడర్లు కుమ్మక్కయ్యారని అభియోగాలు వస్తున్నాయి.
మొత్తం 1000 కోట్ల విలువ చేసే.. 588 ఎకరాల స్థలంలో ప్రభుత్వం, రైతులు, పేదలు, రిటైర్డ్ ఆర్మీ అధికారుల భూములు ప్లాట్లు ఉన్నాయి. అయితే దీనిపై స్పందించిన అన్నారం గ్రామ సర్పంచ్ మాకం తిరుమల వాసు రైతుల పక్షాన నిలబడ్డారు.