మోడీకి దేశ ప్రయోజనాలకంటే స్నేహితుడి ప్రయోజనాలే ఎక్కువ కావడం సిగ్గుచేటని విమర్శించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఈ మేరకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ చేసిన ట్వీట్ ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. మంచి పరిశోధన, గొప్ప విశదీకరణ క్రిశాంక్ అని ప్రశంసించారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో ఇచ్చిన హామీని.. ప్రధాని పట్టించుకోకపోవడం వెనుక అసలు కారణం ఏందో మనకు ఇప్పుడు తెలిసిందంటూ సెటైర్లు వేశారు. ప్రధానికి దేశ ప్రయోజనాలకంటే స్నేహితుడి ప్రయోజనాలే ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్.
కాగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్ ట్విటర్ వీడియోలో విశ్లేషణాత్మంగా వివరించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు బైలడిల్లా నుంచి బయ్యారానికి ముడి ఇనుము సరఫరా చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్నారు.
కానీ ప్రధాని మోడీ మాత్రం తెలంగాణ వినతిని పట్టించుకోకుండా బైలడిల్లా నుంచి కొరియన్ కంపెనీ పాస్కోకు ముడి ఇనుమును సప్లయ్ చేయాలని 2018 ఏప్రిల్ 25న నిర్ణయించారని వెల్లడించారు.
ఈ క్రమంలో 2018 సెప్టెంబర్ 20న గుజరాత్ వ్యాపారవేత్త గౌతమ్ ఆదానీ బైలడిల్లాను టేకోవర్ చేశాడని, పాస్కో కంపెనీ, అదానీ కంపెనీ కలిసి రూ.37,500 కోట్ల స్టీల్ మిల్ డీల్‌పై సంతకాలు చేశారని క్రిశాంక్ తెలిపారు. క్రిశాంక్ ట్వీట్‌ను మెచ్చుకుంటూ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.