హైదరాబాద్ లోని పాతబస్తీ అభివృద్ధిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పాతబస్తీలో రోడ్డు నెట్వర్క్ కు సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు.
ఇప్పటికే హైదరాబాద్ నగర అభివృద్ధి నాలుగు దిశలా విస్తరిస్తూ.. అద్భుతమైన ప్రగతితో ముందుకు సాగుతోందని అన్నారు. పలు ఫ్లై ఓవర్లు, రోడ్ల నిర్మాణం పూర్తయిందని, జనావాసాలు ఎక్కువగా ఉన్న పాతబస్తీలాంటి ప్రాంతాల్లో రోడ్డు డివైండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
చార్మినార్, చౌమహాల్లా ప్యాలెస్, మదీనా, మక్కా మసీద్, సాలార్జంగ్ మ్యూజియం తదితర పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపైన ప్రత్యేక దృష్టి సారించినట్లు కేటీఆర్ చెప్పారు. భూసేకరణ కోసం మరిన్ని నిధులను కేటాయించేందుకు సిద్ధమని ప్రకటించారు.
ట్రాఫిక్ జంక్షన్ లతో పాటు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, మూసీపై వంతెనల నిర్మాణాన్ని వేగవంతం చేసినట్లు చెప్పారు. గత 8 ఏండ్లలో పాతబస్తీలో తాగునీటి సరఫరా మెరుగుపడిందని అన్నారు. హైదరాబాద్ తో పాటు పాతబస్తీలోను విద్యుత్ సరఫరా వ్యవస్థ మెరుగైందని చెప్పారు మంత్రి కేటీఆర్.