బాసర ట్రిపుల్ ఐటీకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము ఇచ్చిన హామీల అమలుపై ట్రిపుల్ ఐటీ అధికారులను ప్రశ్నించారు. బాసర ట్రిపుల్ నిర్వహించిన 5వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్స్ ఆహారం, ఆరోగ్యం, సానిటేషన్ విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా యూనివర్సిటీకి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తామన్నారు.
మెస్ కాంట్రాక్టర్లను మార్చక పోవడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారులు ఉండి కాంట్రాక్టర్లను మార్చక పోవడం ఏంటని వీసీని నిలదీశారు. నాణ్యమైన భోజనం పెట్టకుంటే ప్రభుత్వం ఉండి ఏం లాభమన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని.. ఎవరైనా ఎక్కువ చేస్తే పోలీసులకు చెప్పి సెట్ చేయండని ఆదేశాలు జారీ చేశారు కేటీఆర్. అలాగే క్యాంపస్ లో ప్రత్యేకంగా సోలార్ పవర్ గ్రిడ్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బాసర ట్రిపుల్ ఐటీలో 70 శాతం మంది అమ్మాయిలే చదువుతున్నారని.. వారి కోసం 10 పడకల డెడికేటెడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
అటు సైన్స్ బ్లాక్ కోసం రూ. 5 కోట్లతో ఏర్పాటు చేస్తామని.. ఇక్కడి చెరువును సుందరీకరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బాసర ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి రూ.27 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదని.. బాసర ట్రిపుల్ ఐటీలో చదివిన ఎంతో మంది విద్యార్థులు.. తమ టాలెంట్ తో ఉన్నత కంపెనీల్లో ఉద్యోగాలు పొందారన్నారు. ప్రభుత్వ పాలసీల వల్ల ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు హైదరాబాద్ కు తరలివస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
టీఎస్ ఐపాస్, ప్రభుత్వ చర్యల వల్ల అవినీత రహిత క్లియరెన్స్, పారదర్మక పెట్టుబడులు వల్ల దాదాపు 17 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు. పేద పిల్లలకు అవకాశం లభించాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. అందుకే అంబేద్కర్, పూలే స్కాలర్ షిప్ పేరిట విద్యార్థులకు విదేశీ విద్యను అభ్యసించేందుకే రూ.25 లక్షలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు స్టూడెంట్స్ కి లాప్ టాప్ లు, యూనిఫామ్ లు పంపిణీ చేశారు. అలాగే పలు గ్రూపుల్లో టాపర్ గా నిలిచిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు.