నాకు పర్సనల్ లైఫ్ ఉండదా, నేను బయట మాత్రమే మంత్రిని.. ఇంట్లో కాదంటూ తనపై వస్తోన్న వార్తలను ఖండించారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. మునుగోడు ఉపఎన్నిక వేళ పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. నేతల మధ్య విమర్శలు, ఆరోపణలతో మునుగోడు బై పోల్ కాక రేపుతోంది. ఏ చిన్న సాకు దొరికినా వారిపై మరింత విజృంభిస్తున్నారు నేతలు. తాజాగా మునుగోడు ఓటర్లకు మందు పోసి.. వాళ్లను ప్రలోభపెట్టేందుకు మంత్రి మల్లారెడ్డి ప్రయత్నించారంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తా కథనాలు వచ్చాయి. మంత్రి మల్లారెడ్డి ముందు మద్యం గ్లాసు, ఆయన చేతిలో ఫుల్ బాటిల్ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మునుగోడు ప్రచారంలో మంత్రి మద్యం తాగుతున్నారంటూ ఫొటోలు నెట్టింట హల్చల్ అయ్యాయి.
తాజాగా ఈ వార్తలపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. మునుగోడులో ప్రచారం ముగిసిన అనంతరం బంధువుల ఇంట్లో మద్యం తాగితే తప్పా? అంటూ ప్రశ్నించారు మల్లారెడ్డి. ప్రత్యర్థి పార్టీలు కావాలనే తన ఫొటోలను వైరల్ చేస్తూ అనవసర రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఇందులో తనకు తప్పేమీ కనబడటం లేదంటూ మంత్రి చెప్పుకొచ్చారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామంటూ బీజేపీ చెబుతోందని, అవసరమైతే దీనిపై సీబీఐ విచారణకైనా సిద్దమంటూ మల్లారెడ్డి తెలిపారు. తమ బంధువుల ఇంట్లో జరిగిన ఓ విందులో చుట్టాలకు మందు పోశానని, అందులో తప్పేముందని అన్నారు మంత్రి.
మునుగోడు ఓటర్లకు మందు పోసి వాళ్లను ప్రలోభపెట్టేందుకు మంత్రి మల్లారెడ్డి ప్రయత్నించారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఓటర్లకు మందు పోసి ప్రలోభపెట్టాల్సిన ఖర్మ తమకు లేదని, మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఆయన చెప్పారు. తాను ఓటర్లకు మందు పోయలేదని, తమ బంధువులకు మాత్రమే పోశానని తెలిపారు. తన బావ ఇంట్లో ఫంక్షన్ ఉందంటే వెళ్లానని, అక్కడ తెలిసిన చుట్టాలకు మందు సర్వ్ చేశానని స్పష్టం చేశారు.
ఓ మంత్రిగా ఉండి అలా మందు పోయొచ్చా.. అని తనను ట్రోల్ చేస్తున్నారని, తనకు పర్సనల్ లైఫ్ ఉండదా అని మంత్రి ప్రశ్నించారు. నాపై ఆరోపణలు చేస్తున్నవాళ్లు వాళ్ల ఇళ్లల్లో మందు తాగడం లేదా? వాళ్ల ఫోటోలను ఇలాగే మీడియాలో వైరల్ చేస్తున్నారా? అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాను బయట మాత్రమే మంత్రినని, ఇంట్లో తనకు పర్సనల్ జీవితం ఉంటుందని చెప్పారు. తానేదో చేయకూడని పనిచేసినట్లు బీజేపీ అవసరసర రచ్చ చేస్తోందని, ఇది సరికాదని ఆయన ఫైర్ అయ్యారు. వైరల్ అవుతున్న ఫొటోలలో తన ముందు ఖాళీ ప్లేట్ ఉందని, అప్పటివరకు తాను మద్యం కూడా సేవించలేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి.